మల్లిఖార్జున లింగా ! ..........
(కంద పంద్యాలు)
కనుమూసి నిన్ను జూచితి
కనుదెరచియు నీదు రూపు గంటిని గానన్
కనుమూసిన కనుదెరచిన
ననుసరణము నీదె మల్లిఖార్జున లింగా !
నీ చింతను జేసెడి మతి
నీ చరణమునందె గలయు, నిఖిల విషయవాం
ఛా చింతను జేసేడి మతి
యా చింతనె గలయు మల్లిఖార్జున లింగా !
మౌనము వాగ్దండమగున్,
ధ్యానము మానసిక దండమౌ, ప్రాణాయా
మానుకృతి దేహదండం
బౌ ననిరిటు బుద్ధులు మల్లిఖార్జున లింగా !
ఎక్కడ నుండునొ నామన
మక్కడ నీ రూపముండు నా తీరుననే
యెక్కడ నా శిరముండునొ
యక్కడ నీ యడుగు మల్లిఖార్జున లింగా !
మంగళగుణ, మంగళకర,
మంగళ పరిపూర్ణ, సర్వ మంగళ నామా
మంగళమగు నిను దలచగ
నంగజ భసితాంగ మల్లిఖార్జున లింగా !
శంభో శివ, శంభో హర,
శంభో యని భజన సేయు సద్భక్తతతిన్
రంభాదులు గోరుదురట
యంభో భ్రుత్కేశ మల్లిఖార్జున లింగా !
శుభమగు నీ నామముచే
శుభములు చేకూరు చిత్తశుద్దియు గలుగున్
సభలోన జయము నంతట
నభయంబును గలుగు మల్లిఖార్జున లింగా !
శివమగు లింగార్చనచే
శివజీవైక్యంబు నిష్ఠసిద్ధులు గలుగున్
సువివేకబుద్ధి యొదవును
నవిహత సుఖమబ్బు మల్లిఖార్జున లింగా !
దండము శివలింగమునకు
దండము రుద్రాక్ష బిల్వతరు భస్మలకున్
దండము పంచాక్షరి కఖి
లాండేశ్వర నామ మల్లిఖార్జున లింగా !
No comments:
Post a Comment